AP / Politics
ఎత్తుకు పైఎత్తు..!
1030 days ago

విభజన కోసం కేంద్రం వేసే ఏ ఒక్క అడుగుకు తాము సహకరించమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందాన్ని బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని కేంద్ర హోంశాఖ అన్నిపార్టీలకు లేఖ రాసింది. ఈ లేఖపై జగన్ పార్టీలో తీవ్రంగానే చర్చ జరిగింది. చివరకు జీవోఎంను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నేతలు కొణతాల, మైసూరారెడ్డి తెలిపారు.

విభజనకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆ పార్టీ కేంద్రానికి లేఖ కూడా రాసింది. జగన్ రాసిన లేఖను ఆ పార్టీనేతలు ఆదివారం విడుదల చేశాడు. అన్ని పార్టీలు జీవోఎంను వ్యతిరేకించి.. సమైక్య ఉద్యమం కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు విభజన చేయాలని కోరుకోవడంలేదని తెలిపారు.

సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రాన్ని విభజించేలా ఉందని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఆయన మాట్లాడే తీరు ఇందుకు నిదర్శమని చెప్పుకొచ్చారు. కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ వెళ్తుందో లేదో చూడాలి. విభజనపై కేంద్రం మళ్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడాన్ని ఇప్పటికే తెలంగాణా టీడీపీ నేతలు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఆసక్తిగా మారింది.

 
 
 
Related News